new variant virus: కరోనా మహమ్మారి నుంచి విముక్తి దొరకబోతుందని.. ఇప్పడిప్పుడే ఉపిరి పీల్చుకుంటున్న జనానికి కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ కలవరపెడుతోంది. ఇది చాలా వేగంగా.. అత్యంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ఇంగ్లండ్‌లో బయటపడిన ఈ న్యూ స్ట్రెయిన్ వైరస్ అక్కడ జనాలను.. ప్రభుత్వాన్ని బెంబేలెత్తిస్తుండగానే.. మరో వేరియంట్ వెలుగుచూసింది. దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్‌లో కూడా కనిపించిందని బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ చెప్పారు.. ఈ వైరస్‌కు సంబంధించి మరో కొత్త వేరియంట్ కరోనావైరస్ రెండు కేసులను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ రకం వైరస్ సోకిన బాధితులు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ వచ్చారని తెలిపారు. బ్రిటన్‌లోని కొత్త రకం వైరస్ కంటే ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్త వైరస్ బాధితులను ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తు్న్నట్లు సమాచారం. కొత్త రకం వైరస్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
“దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కొత్త వేరియంట్ చాలా ఎక్కువ వ్యాప్తి చేయగలదని, ఇది UK లో కనుగొన్న కొత్త వేరియంట్ కంటే ఎక్కువ పరివర్తన చెందినట్లు కనిపిస్తుందని హాంకాక్ చెప్పారు. కొత్త వేరియంట్ ఉన్నవారితోపాటు గత పక్షం రోజులలో దక్షిణాఫ్రికాలో ఉన్న వారందరితో సన్నిహితంగా ఉన్న వారందరికి కూడా పరీక్షలు చేయాల్సిన అవసముందన్నారు. కాగా, ఇప్పటికే దక్షిణాఫ్రికా నుండి వచ్చే ప్రయాణ రాకపోకలపై నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. ఇక, డిసెంబర్ 26 నుండి బ్రిటన్‌లో అంక్షలు కఠినతరం చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా దక్షిణ ఇంగ్లాండ్‌లోని మరెన్నో భాగాలను కూడా అత్యున్నత స్థాయి సామాజిక ఆంక్షలు అమలులో ఉంటాయని మంత్రి హాంకాక్ చెప్పారు.