
తమిళనాడులో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండగా, చెన్నైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 1,989 కరోనా కేసులు నమోదు కాగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క చెన్నైలోనే 1,487 కేసులు నమోదైనట్లుగా తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కేసులతో కలిపి తమిళనాడులో ఇప్పటి వరకు 42,687 కేసులు నమోదు అవ్వగా, చెన్నైలోనే 30,444 కేసులు నమోదు అవ్వడం గమనార్హం.
కాగా, ఈ ఒక్క రోజులో తమిళనాడులో కొత్తగా 1989 మంది కరోనా సోకగా.. అందులో 1,956 మంది స్థానికులు, 33 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 1362 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 23,409కి చేరింది. అయితే శనివారం ఒక్క రోజే భారీగా 30 మంది కరోనా చికిత్ప పొందుతూ ప్రాణాలు కోల్పోవడం కలవరపరుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 397కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో 18,878 మంది చికిత్స పొందుతున్నారు.