ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుండగా.. కేరళలో కొంతమంది..దీని బారి నుంచి తమను కాపాడాలంటూ ‘కరోనా’ అనే క్రైస్తవ సన్యాసినిని ప్రార్థిస్తున్నారు. మలయాళంలో ఆమెనుద్దేశించి చేసిన ప్రేయర్ తో బాటు ఆ సన్యాసిని ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సన్యాసిని ఎవరంటే.. సిరియాలో.. రెండో శతాబ్దంలో రోమన్ల ఆక్రమణ సందర్భంగా తనను క్రైస్తవ సంభూతురాలిగా ప్రకటించుకున్న యువతి అట. నాడు 15 ఏళ్ళ వయసున్న ఆమెను అప్పటి పాలకుడు మార్కస్ ఆరేలియస్ అతి క్రూరంగా చంపించాడట. అయితే ఆమెకు అతీత శక్తులుండేవని సిరియాతో బాటు ఆస్ట్రియా, బవేరీలలో కూడా నమ్మేవారు ఉండేవారని చెబుతారు. ఇప్పుడు ఆ కరోనా అనే సన్యాసినే తమను రక్షించాలని వీరు కోరుతున్నారు. అయితే వీరి నమ్మకాలను కేరళ కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి బిషప్ జోసెఫ్ పాంప్లనీ తోసిపుచ్ఛుతున్నారు. కేథలిక్ చర్చిలోని సన్యాసినుల్లో కరోనా ఒకరు కావచ్ఛునని, కానీ ఇతరుల్లో ఆమె పట్ల ఈ విధమైన విశ్వాసం లేదని ఆయన అంటున్నారు. బహుశా కరోనా అనే పేరు ఉన్నందువల్లే వారిలో ఆ నమ్మకం ఏర్పడి ఉండవచ్ఛునని ఆయన చెప్పారు.