Telugu News CoronaVirus Relatives allegedly takes new born baby and coronavirus positive mother from hospital in hyderabad
బాలింతకు కరోనా..ఆస్పత్రి నుంచి పరార్..ఆందోళనలో వైద్యులు, సిబ్బంది
హైదరాబాద్‌లో ఓ బాలింతకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు... ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆమె బంధువులు తల్లీబిడ్డను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన..
హైదరాబాద్‌లో ఓ బాలింతకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు… ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆమె బంధువులు తల్లీబిడ్డను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
హైదరాబాద్ లోని హఫీజ్ బాబానగర్ కు చెందిన ఓమహిళ ఈ నెల 8న పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ ఆస్పత్రిలో చేరింది. కాగా, ఆ మర్నాడు డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేయగా బాబు పుట్టాడు. అయితే నాలుగు రోజుల కింద ఆమెకు దగ్గు, జలుబు మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆమెను వేరే రూముకు షిఫ్టు చేసి శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులకు పంపారు. సోమవారం రిజల్ట్ లో వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో గాంధీ హాస్పిటల్ కు పంపాలని డాక్టర్లు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ డాక్టర్లు తప్పుగా చెప్తున్నారంటూ వాళ్లంతా గొడవకు దిగారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే, పోలీసులు అక్కడకు వచ్చేలోపేకుటుంబ సభ్యులు ఆ బాలింతను, బాబును తీసుకుని వెళ్లి పోయారు. పోలీసులు వాళ్లను వెతికే పనిలో పడ్డారు. అయితే ఆ మహిళకు ట్రీట్మెంట్ చేసిన ఐదుగురు డాక్టర్లు, ఐదుగురు నర్సు ల్లో ఆందోళన మొదలైంది. వారందరి నుంచి శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపారు. కరోనా పాజిటివ్ అని తేలిన బాలింతకు చికిత్స అందించిన వార్డులోనే మరో పది మంది బాలింతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.