Corona Vaccine: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక కోవిడ్ కారణంగా మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. స్మశానవాటికల బయట శవాలు క్యూ కట్టిన కొన్ని దృశ్యాలు చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతోంది. ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని ఇంక నెల రోజుల పాటు చూపిస్తుందని నిపుణులు చెబుతోన్న నేపథ్యంలో అందరిలో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనాను అరికట్టడానికి మన దగ్గర ఉన్న అస్త్రాలు ఒకటి స్వీయ నియంత్రణ అయితే రెండోది వ్యాక్సిన్. వ్యాక్సిన్‌లు రెండు డోస్‌లు తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. అయితే చాలా మంది అనవసర భయాలకు పోయి.. వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి జంకుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల్లో వ్యాక్సిన్లు సరిపడా ఉన్నా వేయించుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌పై చాలా మంది ప్రముఖులు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇలా బుద్ధిగా చెబితే వినరు అనుకున్నారో ఏమో.. కానీ, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలానికి చెందిన తహసీల్దార్ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారికి ప్రభుత్వం నుంచి అందించే రేషన్ సరుకులు, నెలవారీ పెన్షన్‌ను నిలిపివేస్తామని చాటింపు వేయించారు. వ్యాక్సినేషన్ చేయించుకుంటేనే ఈ పథకాలకు అర్హులవుతారని చెబుతున్నారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు దానిని తప్పనిసరి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భలే ఉంది కదూ… ఈ ఐడియా. మరి మీరు కూడా పరిస్థితులు అక్కడి వరకు చేరకుండా ఉండాలంటే స్వచ్చంధంగా వ్యాక్సిన్ చేయించుకుంటే మంచిది.
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ స్మీమ్ టైం పొడగింపు..