
కరోనా రోగులకోసం నాసా ఇంజనీర్లు కేవలం 37 రోజుల్లో అత్యాధునిక వెంటిలేటర్ ను రూపొందించారు. సాధారణ వెంటిలేటర్ కన్నా ఇది అద్భుతంగా పని చేస్తుందని, ఇందులోని విడి పరికరాలన్నీ అత్యుత్తమ సాంకేతిక నిపుణుల చేత తయారు చేయబడ్డాయని వారు తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. న్యూయార్క్ లోని ఐఖాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో నిర్వహించిన టెస్టులో ఇది ఆమోదయోగ్యమేనని నిర్ధారించారు. అయితే ఆస్పత్రుల్లో ఈ వెంటిలేటర్ వినియోగానికి డ్రగ్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంస్థ అనుమతించిన వెంటనే ఈ సాధనాన్ని ఆయా ఆసుపత్రులకు అందజేయనున్నారు. ముఖ్యంగా అమెరికాలోని చాలా హాస్పిటల్స్ లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ దేశంలో ఇప్పటికే కరోనాకు గురై సుమారు 50 వేలమందికి పైగా మృతి చెందారు. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నాసా రూపొందించిన ఈ సాధనాన్ని ‘వెంటిలేటర్ ఇంటర్ వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ’ అని వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21 న దీనిని నాసా ప్రదర్శించింది.