Lockdown in Mumbai : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈమేరకు అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. నగరంలో ప్రజలు కోవిడ్ నిబందనలు పాటించడం లేదని, దీంతో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్ హెచ్చరించారు. ముంబైలో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులపై మంగళవారం అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహమ్మారి బారి నుంచి రక్షించుకునేందుకు మరోసారి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
‘‘ప్రజల గురించి మాకు చాలా ఆందోళన ఉంది. రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. మనం మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలి. మళ్లీ లాక్‌డౌన్ విధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉంది’’ అని మేయర్ కిషోరి పండేకర్ అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం దేశంలో అడుగుపెట్టిన కరోనా రాకాసి కుదిపేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర జనాన్ని అతలాకుతలం చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ కేసుల్లో అత్యధిక భాగం ముంబై నగరంలోనే నమోదయ్యాయి. దీంతో మూడు నెలల నిర్బంధ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా చాలా మంది నష్టపోయారు. ఇక, మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తే ముంబై ప్రజలు ఆర్థికంగా మరింత కృంగిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also… పుదుచ్ఛేరిలో మైనారిటీలో పడిపోయిన సీఎం నారాయణస్వామి ప్రభుత్వం, మరో ఎమ్మెల్యే రాజీనామా