
తెలంగాణలో రాష్ట్రంలో మొన్నటి వరకు కాస్తా ఊరటనిచ్చిన కరోనా..ప్రస్తుతం ప్రతాపం చూపెడుతోంది. రాష్ట్రంలో మే 20 బుధవారం రోజున మరో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1661కి పెరిగింది.. మృతుల సంఖ్య 40కి చేరింది. బుధవారం నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలోనే 15 కేసులు నిర్ధారణ కాగా.. మరో 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ బారినపడ్డ వలస కార్మికుల సంఖ్య 89కి చేరింది. అయితే, రాష్ట్రంలోకి ఇటీవల వచ్చిన వలస కూలీలు, కార్మికుల కారణంగా ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయి. దీంతో ఐసీయూ సేవలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వెంటిలేటర్ల కొరత లేకుండా మొబైల్ ఐసీయూలను అందుబాటులోకి తెస్తోంది.
ఓ బస్సులో ఐసోలేషన్ వార్డుల, అన్ని వైద్య పరికరాలు అమర్చి అత్యవసరమైన ప్రాంతాలకు తరలించి రోగులకు సేవలను అందించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ ఐసీయూను తీర్చిదిద్దారు. ఇందులో మూడు పడకలు, రెండు వెంటిలేటర్లతో పాటు ఐసీయూలో సౌకర్యాలు కల్పించారు. వీటిని ముందుగా నిజామాబాద్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎవరికైనా వ్యాధి సోకితే గాంధీ ఆస్పత్రి వరకు తీసుకురావాలి. అత్యవసరం అయితే ఈ మొబైల్ ఐసీయూ బస్సు ద్వారా ఆయా జిల్లా కేంద్రాల్లోనే వెంటిలెటర్ చికిత్స అందించనున్నారు. కొన్ని సమయాల్లో అందుబాటులో లేకపోతే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అటువంటి సమయాల్లో ఈ మొబైల్ ఐసీయూ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు.