కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉన్న యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తాను ఉన్న వార్డులోని మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతడు కలవరం చెందాడు. తనను వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశాడు. అయితే అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆ యువకుడు వార్డులోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అధికారులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకుని మరో చోటికి తరలించారు.
కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాటిజివ్ అని తేలింది. కరోనా వైరస్‌ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు, తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 809కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది కరోనా బారినపడి ప్రాణాలు మరణించారు.