అమెరికాలో తమ సంస్థకు చెంసిన 76 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలను ఇండియాకు తిరిగి తీసుకువచ్చేందుకు ఇన్ఫోసిస్ చేసిన యత్నం ఫలించింది. ఈ ఉద్యోగుల్లో చాలామంది వీసాల కాల పరిమితి ముగియగా మరి కొందరి వీసాల గడువు త్వరలో ముగియనుంది. ఖతర్ ఎయిర్ వేస్ కి చెందిన విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వీరిని బెంగుళూరుకు చేర్చింది. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన కారణంగా తమ సిబ్బంది కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా ఖతర్ ఎయిర్ లైన్స్ విమాన సౌకర్యాన్ని వినియోగించుకుంది. అమెరికాలో ఈ సంస్థ తరఫున దాదాపు 18 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చాలామంది హెచ్-1 బీ వీసాలపై పని చేస్తుండగా.. ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ ఫర్లలో వర్క్ చేస్తున్నవారు ఎల్-1 వీసాలను ఉపయోగించుకుంటున్నారు. హెచ్.1 బీ వీసా హోల్డర్లు ఆరేళ్ళ పాటు, ఎల్-1 వీసా హోల్డర్లు యుఎస్ లో అయిదేళ్ల పాటు ఉండవచ్ఛు. గతంలో భువనేశ్వర్ లో సంభవించిన వరదల సందర్భంలో కూడా ఇన్ఫోసిస్ తమ సుమారు ఐదు వందలమంది ఉద్యోగులను బెంగుళూరు, ఇతర కేంద్రాలకు రప్పించుకుంది.