India reports record corona cases : దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. భారతదేశంలో నమోదవుతోన్న కరోనా కేసులు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజులోనే నమోదైన కరోనా కేసుల సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటింది. నిన్నటి ఒక లక్షా 99 వేల 376 రికార్డును చెరిపేసి ఇవాళ ఏకంగా 2 లక్షల 739 కేసులతో దేశంలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది కోవిడ్ మహమ్మారి. ఇక, గత 24 గంటల్లో దేశంలో కరోనా మహమ్మారి నుంచి బయటపడి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 93, 528గా ఉంది. కరోనా మృతులు 1,038 నమోదయ్యాయి. ఇక, ఈ మహమ్మారి కాటుకు దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజులోనే 1,027 మంది మృతి చెందారు అటు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాకెట్ స్పీడ్‌తో విస్తరిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. పరిస్థితి చూస్తే చేయి దాటిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.13 వేల 413 మంది మృతి చెందారు. ఇక మన దేశానికొస్తే కరోనా రక్కసి కేసులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది కరోనా మహమ్మారి. ఒక్కరోజులోనే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇవే అత్యధిక కేసులు. ఇక మహారాష్ట్రలో ఐతే 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.