దేశవ్యాప్తంగా జోరందుకున్న కోవిడ్ వ్యాక్సినేషన్.. టీకా పంపిణీలో ప్రపంచంలో భారత్ మూడో స్థానం

|

Feb 07, 2021 | 9:45 PM

దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి చేపట్టిన ప్రతిష్ఠాత్మక వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇదే క్రమంలో అత్యధికంగా కరోనా టీకాలను అందిస్తున్న దేశాల్లో భారత్‌ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా జోరందుకున్న కోవిడ్ వ్యాక్సినేషన్.. టీకా పంపిణీలో ప్రపంచంలో భారత్ మూడో స్థానం
Covid-19 vaccine certificate
Follow us on

Covid vaccine in India : మాయదారి మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి చేపట్టిన ప్రతిష్ఠాత్మక వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇదే క్రమంలో అత్యధికంగా కరోనా టీకాలను అందిస్తున్న దేశాల్లో భారత్‌ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 57.75లక్షల మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 53,04,546 మంది వైద్యారోగ్య సిబ్బంది కాగా.. 4,70,776 మంది కరోనా యోధులకు కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ దేశాలు కొనసాగుతున్నాయి.

దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కొవిడ్‌ టీకా అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 6,73,542 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో ఏర్పాటు చేసిన 8,875 సెషన్లలో 3,58,473 మందికి టీకా అందచేశామని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా టీకా పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే, గడచిన 24 గంటల్లో ఎనభై కంటే తక్కువ మరణాలు నమోదయ్యాయని.. ఇది గత తొమ్మిది నెలల్లో కనిష్ఠమని వైద్యారోగ్య అధికారులు వివరించారు. దేశంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య 1.48 లక్షలు ఉండగా, ఇది మొత్తం కేసుల సంఖ్యలో 1.37 శాతంగా ఉందని ఆ శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి… తొలివిడత పంచాయతీ పోరుకు ముగిసిన ప్రచారం.. మంగళవారం 2,731 పంచాయతీలకు పోలింగ్‌