
హైదరాబాద్ లోని ఐఐటీ సంస్థ ఓ తేలికైన, చవకైన కోవిడ్-19 టెస్ట్ కిట్ ని డెవలప్ చేసింది. ఈ కిట్ ని ఉపయోగించి టెస్ట్ చేయగానే 20 నిముషాల్లోనే ఫలితాలు వెల్లడవుతాయని ఈ సంస్థ రీసెర్చర్లు తెలిపారు. ప్రస్తుతం పాటిస్తున్న ఆర్ టీ-పీసీ ఆర్ టెస్ట్ కిట్లపై ఆధారపడి తాము దీన్ని రూపొందించలేదని వారు చెప్పారు. కేవలం 550 రూపాయల ఖర్చుతో దీన్ని అభివృధ్ది చేశామని, ఇది మాస్ ప్రొడక్షన్ స్థాయికి వచ్ఛేసరికి దీని ధర 350 రూపాయలకు తగ్గవచ్చునని వారు పేర్కొన్నారు. నగరంలోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ కిట్ కి ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహించామని ఐఐటీ హైదరాబాద్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ శివగోవింద్ సింగ్ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి మధ్య ఫలితాలను ఈ కిట్ అతి తక్కువ సమయంలోనే వెల్లడిస్తుందన్నారు. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్ఛునన్నారు. కోవిడ్-19 జీనోమ్ లోని అసాధారణ లక్షణాలను ఈ కిట్ ద్వారా తాము గుర్తించగలిగామన్నారు.