పెరిగిపోతున్న కరోనా కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ నగరంలో ఇంటింటి స్క్రీనింగ్ కి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సమాయత్తమైంది. జులై 6 కల్లా ప్రతి ఇంటినీ స్క్రీన్ చేయాలని అధికారులను ఆదేశించింది. 62 వేల కరోనా కేసులు రికార్డయిన ఈ సిటీలో 261 కంటెయిన్మెంట్ జోన్లు ఉన్నాయి. ప్రతి ఇంటినీ స్క్రీన్ చేయాలన్న కొత్త ప్లాన్ ని తక్షణమే అమలు చేయనున్నారు. మంగళవారం ఒక్క రోజే హస్తినలో 3,947 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్ని అత్యధిక కేసులు మరే ఇతర రాష్ట్రాల్లోనూ నమోదు కాలేదు. ఈ నెల 30 కల్లా కంటెయిన్మెంట్ జోన్ల లోని ప్రతి ఇంటినీ స్క్రీనింగ్ చేయనున్నారు. అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ ని కూడా యుధ్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. నగరంలో ప్రతి రోజూ రెండున్నర వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతుండగా.. 75 మరణాలు సంభవిస్తున్నాయి. సవరించిన కొత్త వ్యూహం ప్రకారం.. జిల్లాల స్థాయిలో పటిష్టమైన మానిటరింగ్ ప్లాన్ ని అమలు చేయనున్నారు. ఈ ప్లాన్ ప్రకారం ఇక పోలీసు అధికారులు కూడా ఇంటింటి స్క్రీనింగ్, సర్వేలెన్స్, వంటి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.