
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకూ వందల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకోంది.
హూగ్లీ జిల్లాకు చెందిన దేబ్‌దత్తా సెరాంపోర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతవారం ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేర్పించారు..చికిత్స పొందుతూనే.. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనా బారిన మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.