భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,755 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశంలో పాజిటివ్ కేసుల పెరుగుదల 8.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,113కి చేరింది. మహమ్మారి బారినపడి మొత్తం 721 మంది మృతిచెందారు. దేశరాజధానిలో ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా వైరస్ మీద పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.
కోవిడ్-19 మహమ్మారి హస్తినను హడలెత్తిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతర పోరాటంలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే 39 మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్ సోకగా వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కరోనా పేషంట్లకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి, కరోనా నియంత్రణకు ప్రయత్నిస్తున్న పోలీసులతో పాటు పలువురు జర్నలిస్టులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.