Bharat Biotech Covaxin Phase 3 Trials: భారత ఫార్మ దిగ్గజం.. హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన ‘కొవాగ్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఈ మేరకు సంస్థ ఫలితాలను బుధవారం వెల్లడించింది. 18-98 మధ్య వయస్సు ఉన్న మొత్తం 25,800 మందిపై కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో టీకా మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 80.6 శాతంగా నమోదైనట్టు సంస్థ తెలిపింది. అయితే ఇంతమంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారని పేర్కొంది.
మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వలంటీర్లలో 2,433 మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారని భారత్ బయోటెక్ తెలిపింది. వీరిలో 4,500 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్టు సంస్థ వెల్లడించింది. మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌తో పోలిస్తే, మూడో దశలో టీకా ఫలితాలు బాగా మెరుగైనట్లు వెల్లడించింది. కొవాగ్జిన్ రెండో డోస్ ఇచ్చిన తర్వాత వాలంటీర్లకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు సోకలేదని, ఎలాంటి సమస్యలు కూడా తలెత్తలేదని ప్రకటించింది.
కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్‌లో 80.6 శాతం సమర్థతను చూపించిందని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. బ్రిటన్‌లో కనుగొన్న కొత్త కరోనా స్ట్రెయిన్‌తో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న ఇతర కరోనా స్ట్రేయిన్లకు వ్యతిరేకంగా తమ టీకా రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంపొందిస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.
కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా కొందరికి టీకాను ఇచ్చి పరిశోధనలు జరిపారు. మరికొందరికి కేవలం గ్లూకోజ్‌లాంటి ఇంజెక్షన్‌ను ఇచ్చి పరిశీలించారు. టీకా ఇచ్చిన అందరిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవైపు అత్యవసర వినియోగం కింద వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. టీకా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి భారత్ బయోటెక్ సంస్థ భారీ ఎత్తున మూడవ దశ ప్రయోగాలు జరిపి విజయవంతమైంది.
Also Read: