ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పద్దెనిమిది వేల మందికిపైగా.. ప్రాణాలు కోల్పోగా.. మరో నాలుగున్నర లక్షల మంది వరకు పాజిటివ్ కేసులతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా మనదేశంలో కూడా ఈ వైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆరువందల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు (21రోజులు) లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పార్లే యాజమాన్యం తన ఔదార్యాన్ని చాటుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు.. యాచకులకు ఇబ్బందులు తలెత్తుకుండా.. తమ వంతు సాయంగా మూడు కోట్ల బిస్కెట్ ప్యాకెట్లను అందజేయనున్నట్లు ప్రకటించింది. అది కూడా ప్రభుత్వ పరంగానే వాటిని సప్లే చేయిస్తామని ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం తమ కంపెనీ 50 శాతం మంది వర్కర్స్ ను ఉపయోగించి పనులు చేయిస్తుందని పేర్కొంది.