COVID-19: పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ ముంచుకొస్తోంది. నిను వీడను నేను అంటూ.. చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా వైరస్. శనివారం దేశంలో కొత్తగా 4, 270 కేసులు నమోదవగా..15 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 4,31,76,817కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 5,24,692కు చేరింది. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. 24వేల 52కు చేరింది యాక్టివ్ కేసుల సంఖ్య. 2,619 మంది వైరస్ నుంచి రికవర్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,26,28,073గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. ఇక కరోనాకు పుట్టినిల్లు చైనా(China) అయితే.. మన దేశంలో కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది కేరళ(Kerala). అక్కడ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. కేరళతో పాటు ఢిల్లీ(delhi), మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1357మంది కరోనా బారిన పడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పంజా విసురుతోంది కొవిడ్ మహమ్మారి. అక్కడ శనివారం 405 కేసులు నమోదవగా..384మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధానంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ పెరుగుతున్నట్టు గుర్తించిన కేంద్రం..ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా శనివారం 11,92,427 మందికి వ్యాక్సిన్ అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,09,46,157కు చేరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..