కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మళ్లీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. కొత్తగా కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 800కి పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడంతో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా పాజటివ్ కేసుల సంఖ్య నెలరోజుల్లోనే ఆరు రెట్లు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. ఫిబ్రవరి 18న కేవలం 112 కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్య ఆరోగ్య తెలిపింది. తాజాగా 841 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరినట్లు తెలిపింది. అంతేకాదు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం మరోసారి కరోనా గుబులు రేపుతోంది. తాజాగా కేసుల్లో జార్ఖండ్‌లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారని వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది.
యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు అతి స్వల్పంగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే కరోనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్నదన్న విషయం గుర్తి చేస్తున్నారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద.. ఇప్పటి వరకు 220 కోట్ల డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కోవిడ్ మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 27న తెలంగాణలో సున్నా కేసులు నమోదయ్యాయి. దాంతో వైరస్ ఇక మనల్ని పూర్తిగా విడిచి పెట్టేసిందని సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 50 శాతానికి పైగా కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా గడచిన ఐదు రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి.
కరోనా వైరస్ ఆనవాళ్ల గురించి చైనా తన వద్ద ఉన్న డేటాను షేర్ చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా ఆనవాళ్లకు చెందిన అంశంపై డబ్ల్యూహెచ్‌వో కొన్ని కీలక ఆధారాలను బయటపెట్టింది. కరోనా డేటాను మూడేళ్ల క్రితం ఎందుకు రిలీజ్ చేయలేదని చైనా అధికారుల్ని డబ్ల్యూహెచ్‌వో ప్రశ్నించింది. చైనా తన డేటా నుంచి తొలగించిన ఆధారాలను తక్షణమే అంతర్జాతీయ సమాజంతో పంచుకోవాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. కరోనా వైరస్ అక్రమంగా ట్రేడింగ్ చేసిన రకూన్ కుక్కల నుంచి మనుషులకు సోకినట్లు ఆ డేటా ద్వారా శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. వుహాన్‌లోని హువనన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌లో ఆ ఇన్‌ఫెక్షన్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ చైనా అధికారులు జీన్ సీక్వెన్సింగ్ డేటాను తొలగించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తొలుత రకూన్ కుక్కలకు వ్యాపించిన వైరస్.. ఆ తర్వాత ఆ జంతువుల ద్వారా మనుషులకు వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..