కేరళలో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. రాష్ట్రంలో 3,503 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రంగా మారుతోందని, పాజిటివ్ కేసులు కనబడని వారిలోనూ ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉండడం మరీ కలవరానికి గురి చేస్తోందని ఆయన అన్నారు. కొన్ని కేసుల్లో ఇన్ఫెక్షన్ మూలాన్ని కనుగొనగలిగామని ఆయన చెప్పారు. ఒక్కసారిగా రాష్ట్రంలో ఈ కేసులు ఇన్ని పెరుగుతాయని అనుకోలేదన్నారు. కాగా-మంగళవారం ఒక్కరోజే 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి కొల్లం జిల్లాకు చేరుకున్న ఓ కరోనా రోగి నిన్న మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 22 కి చేరింది. పథనంథిట్ట, పలక్కాడ్ జిల్లాల్లో 27 కేసుల చొప్పున, అళపురలో 19,త్రిసూర్ లో 14, ఎర్నాకుళంలో 13, మలప్పురంలో 11,కొట్టాయంలో 8, కోజికోడ్, కన్నూరు జిల్లాల్లో ఆరు కేసుల చొప్పున నమోదయ్యాయి. పాజిటివ్ కేసులకు సంబంధించి 79 మంది విదేశాల నుంచి, 52 మంది ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి చేరుకున్నారని తెలుస్తోంది.