ఓ వైపు కరోనా నియంత్రణకు అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. కోవిడ్ వైరస్ పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేదుకు గానూ ప్రభుత్వ, ప్రైవేటు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో కూరుకుపోయిన నిర్లక్ష్యం వీడటం లేదు. సామాజిక దూరం పాటించాలని, వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కంఠపదంగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో సికింద్రాబాద్ మెట్టుగూడ ప్రాంతంలో వైరస్ పాజటివ్‌గా తేలిన యువతి హల్‌చల్ చేసింది. వివరాల్లోకి వెళితే…
నగరంలోని కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి కరోనా పెషేంట్ ఒకరు తప్పించుకున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ మెట్టుగూడ ప్రాంతానికి చెందిన స్నేహా అనే యువతికి వైరస్ పాజిటివ్‌గా తేలటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆమె ఆస్పత్రి నుంచి తప్పించుకుందని, సికింద్రాబాద్‌లోని పలు ఏరియాలో తిరుగుతుందని తెలిసి అధికారులు, సిబ్బంది గాలింపు చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యువతి కోసం గాలించారు. చివరకు రాత్రి బాగా చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చిన ఆమెను పోలీసుల ఆధ్వర్యంలో తిరిగి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలితో పాటుగా కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు పంపించారు. వారి శాంపిల్స్‌ని కూడా టెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. తమ కాలనీలో ఉంటున్న యువతికి కరోనా అని తేలటంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు.