చైనాను దాటేసిన భార‌త్‌..త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌ల మ‌ధ్య పోటా పోటీ !

దేశంలో కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరువ‌గా వెళ్తోంది. ప్ర‌స్తుతం 85,940కేసులు న‌మోదుకాగా, మ‌రో 13 వేల‌కు పై చిలుకు వ‌స్తే ల‌క్ష కేసుల జాబితాలో భార‌త్ చేరుతుంది.

చైనాను దాటేసిన భార‌త్‌..త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌ల మ‌ధ్య పోటా పోటీ !

Updated on: May 16, 2020 | 11:02 AM

భార‌త్‌లో గడిచిన 24 గంటల్లో 3,970 కొత్త పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా, వైరస్‌ సోకి 103 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కి చేరింది. ఇక ఇప్పటివరకు 30,153 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 2,752 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 53,035 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విషయంలో భారత్‌ చైనాను దాటింది. చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదు కాగా భారత్‌లో 85,940 కేసులు నమోదయ్యాయి.

దేశంలో క‌రోనా వేగం పెరిగింది. కొన్ని రోజుల నుంచి రోజుకు 3వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య న‌మోద‌వుతూ వ‌స్తోంది.  దీంతో దేశంలో  కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరువ‌గా వెళ్తోంది. ప్ర‌స్తుతం 85,940కేసులు న‌మోదుకాగా, మ‌రో 13 వేల‌కు పై చిలుకు వ‌స్తే ల‌క్ష కేసుల జాబితాలో భార‌త్ చేరుతుంది.  ఇండియా కంటే ముందు ఇరాన్, ట‌ర్కీ, జ‌ర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక భార‌త్‌లో మ‌హారాష్ట్ర అత్య‌ధిక కేసుల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌లు కోవిడ్‌-19 కేసుల సంఖ్య‌లో పోటీప‌డుతున్నాయి.

క‌రోనా మ‌హ‌మ్మారి త‌మిళ‌నాడును క‌కావిక‌లం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా త‌మిళ‌నాడు రెండో స్థానంలోకి చేరింది. మొన్న‌టి వ‌ర‌కు గుజ‌రాత్ అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు త‌మిళ‌నాడు గుజ‌రాత్ స్థానాన్ని ఆక్ర‌మించేసింది.  అక్కడ కోవిడ్-19 బాధితుల సంఖ్య 10వేలు దాటింది. తమిళనాడు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..  434 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఐదుగురు చనిపోయారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,108కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,599 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 7,435 యాక్టివ్ కేసులున్నాయి.

ఇక‌, గుజ‌రాత్‌లోనూ కోవిడ్‌-19 భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది. మే 15న రాత్రి గుజరాత్ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో గుజరాత్‌లో 340 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మరణించారు. తాజా లెక్కలతో గుజరాత్‌లో మొత్తం కరోనా కేసుల‌ సంఖ్య 9,932కి చేరింది. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 4,035 మంది కోలుకోగా.. 606 మంది మరణించారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 5,291 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఉన్న కరోనా కేసుల్లో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.