దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం.. వైరస్ కట్టడికి మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

|

Mar 06, 2021 | 6:10 PM

భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం.. వైరస్ కట్టడికి మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
Follow us on

Central teams rush to covid areas : భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం శనివారం అత్యధిక కేసు నమోదవుతున్న మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయం తీసుకుంది. అయా ప్రాంతాల్లో ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయంగా వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను ఇస్తూ పనిచేస్తాయి.

దేశవ్యాప్తంగా కరోనాకేసుల ఉధృతి తగ్గకపోవడంతోనే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా
పంజాబ్, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా తాజా పరిస్థితులను సమీక్షించి అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రెండు రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించనున్నారు. ఇక దేశంలోనే కరోనాకేసులలో అత్యంత ప్రభావితం రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో ఏడు జిల్లాలలోనూ,ప్రభావం ఎక్కువగా ఉన్న మునిసిపాలిటీలలోనూ కేంద్ర బృందాలు రంగంలోకి దిగనున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అత్యున్నత కేంద్ర బృందాలు , రాష్ట్ర బృందాలకు గైడెన్స్ ఇవ్వనున్నాయి.


అక్కడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల బృందాలను రంగంలోకి దింపింది. ఈ మేరకు కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర బృందాలు రాష్ట్ర అధికారులకు సహకరించనున్నాయి. మహారాష్ట్రలో పర్యటించనున్న బృందానికి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక అధికారి పీ. రవీంద్రన్ నేతృత్వం వహించనున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ పంజాబ్‌లోని బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇక తాజా లెక్కల ప్రకారం.. పంజాబ్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6661గా ఉంది. మహారాష్ట్రలో 90 వేల పైచిలుకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ బృందాలు తొలుత రెండు రాష్ట్రాల్లోని కరోనా హాట్‌స్పాట్‌లల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేయనున్నాయి. ఈ వివరాలను కేంద్రానికి నివేదిస్తాయి. కరోనా కట్టడికి కోసం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచిస్తాయి. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తరచూ నిపుణులు బృందాలని ఆయా రాష్ట్రాలకు పరిశీలన కోసం పంపిస్తోంది. తద్వారా.. కరోనా కట్టడిలో ఎదురువుతున్న సవాళ్లు ఏమిటనేది తెలుసుకోవడంతో పాటూ నిపుణుల సాయంతో తగు పరిష్కారాలను కూడా సూచిస్తోంది.

కాగా, ఓ వైపు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా చురుకుగా సాగుతోంది. మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి టీకాలను అందజేశారు. రెండో విడతలో 60 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అంతేకాకుండా 45 ఏళ్లుపైబడి, దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కోవిడ్ టీకాలను అందిస్తున్నారు. అయినప్పిటికీ దేశవ్యాప్తంగా మరోసారి కొత్త వేరియంట్లతో కరోనా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రాహ్మణ సంఘం మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు