Covid Booster Doses: దేశవ్యాప్తంగా మొదలైన బూస్టర్ డోసు పంపిణీ.. మూడో డోస్ ఎలా పొందాలంటే..?

|

Jan 10, 2022 | 2:44 PM

మహమ్మారిపై పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఈ సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు పంపిణీని ప్రభుత్వాలు చేపట్టాయి.

Covid Booster Doses: దేశవ్యాప్తంగా మొదలైన బూస్టర్ డోసు పంపిణీ.. మూడో డోస్ ఎలా పొందాలంటే..?
Vaccine
Follow us on

Covid 19 Vaccine Booster Doses in India: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు.. రూపం మార్చుకున్న రాకాసి వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో మహమ్మారిపై పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఈ సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు పంపిణీని ప్రభుత్వాలు చేపట్టాయి. నేటి (జనవరి 10, సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అర్హులు అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌‌లైన్ వర్కర్లు, పోలీసులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వృద్ధులకు సోమవారం నుంచి కరోనా టీకా బూస్టర్ డోస్(ప్రికాషనరీ) వేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బూస్టర్ డోసు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ చార్మినార్‌‌‌‌ వద్ద ఉన్న ప్రభుత్వ యునానీ హాస్పిటల్‌‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బూస్టర్ డోస్‌‌పై అనుమానాలొద్దని అన్నారు. బూస్టర్ డోస్‌తో ప్రయోజనాలు ఉన్నాయని.. అర్హులైన అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరారు. అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో మొదటి డోస్ 102 శాతం, రెండో డోసు 78 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందజలో ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, వ్యాక్సిన్ తప్పనిసరి అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌‌ లైన్ వర్కర్లు కలిపి 6.34 లక్షల మంది ఉన్నారు. 60 ఏండ్లు దాటినోళ్లు 41.6 లక్షల మంది ఉండగా, వారిలో 20 శాతం మంది వివిధ రోగాలతో బాధపడుతున్నట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ అంచనా వేసింది. కాగా, వ్యాక్సినేషన్‌‌కు సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే, మూడో డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండో డోసు తీసుకొని 9 నెలలు(39 వారాలు) పూర్తయిన వారికి మాత్రమే బూస్టర్ డోసు ఇవ్వాలని సూచించింది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సహా పాత డెల్టా ఇతర వేరియంట్లు దేశంలో మళ్లీ కలకలం రేపుతున్న సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు పంపిణీని ప్రభుత్వాలు చేపట్టాయి. నేటి (జనవరి 10, సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అర్హులు అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది. మహమ్మారిపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్లుగా భావించే ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా, పోలీస్ దళాలతోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లోని ఈసీ సిబ్బందిని సైతం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి మూడో డోసును అందింస్తోంది.

మూడో(బూస్టర్) డోసు పొండానికి అర్హులైన వారిలో 1.05 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన 2.75 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అర్హులుగా గుర్తించిన వారి ఫోన్ నంబర్‌కు కోవిన్ పోర్టల్ నుంచి ఎస్ఎంఎస్ అందుతుందని ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో 45 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ‘ముందుజాగ్రత్త మోతాదు’ తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ, మునిసిపల్, ప్రైవేట్ టీకా కేంద్రాలలో బూస్టర్ లేదా నివారణ మోతాదులు ఇవ్వడం జరుగుతుందని కేంద్ర స్పష్టం చేసింది.

కాగా, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తొమ్మిది నెలలు లేదా 39 వారాల వ్యవధి ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. దీనికోసం కొత్తగా కోవిన్ పోర్టల్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే రెండు డోసులు పొందారు. కాబట్టి ప్రిస్కిప్షన్స్, మెడికల్ హిస్టరీకి సంబంధించి పేపర్లు చూపించకుండానే వృద్ధులు మూడో డోసు వ్యాక్సిన్ పొందొచ్చు.

రాష్ట్రంలో హెల్త్ కేర్ వర్కర్లకు గత ఏడాది జనవరి 15న ఫస్ట్‌‌ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకున్నోళ్లు, ఫిబ్రవరి చివరిలో సెకండ్ డోసు తీసుకున్నారు. ఫ్రంట్‌‌లైన్ వర్కర్లకు ఫిబ్రవరిలో ఫస్ట్ డోసు, మార్చి చివరి నుంచి సెకండ్ డోసు ప్రారంభమైంది. ఫిబ్రవరి, మార్చిలో సెకండ్ డోసు తీసుకున్న హెల్త్ కేర్‌‌‌‌ వర్కర్లు, మార్చిలో సెకండ్ డోసు తీసుకున్న ఫ్రంట్‌‌లైన్ వర్కర్లకు మాత్రమే 9 నెలల గడువు పూర్తయింది. ఇప్పుడు బూస్టర్ డోసు తీసుకోవడానికి వీళ్లు మాత్రమే అర్హులు. వృద్ధులకు గత ఏడాది మార్చి ఫస్ట్ నుంచి ఫస్ట్ డోస్, ఏప్రిల్ థర్డ్‌‌ వీక్ నుంచి సెకండ్ డోస్ ప్రారంభమైంది. రెండో డోసుకు, మూడో డోసుకు మధ్య 9 నెలల గ్యాప్ ఉండాలంటే… ఏప్రిల్‌‌లో సెకండ్ డోసు తీసుకున్న వృద్ధులు మూడో డోసు తీసుకోవడానికి ఫిబ్రవరిలో మాత్రమే అర్హులు అవుతారు. అందువల్ల ఇప్పుడు హెల్త్ కేర్, ఫ్రంట్‌‌లైన్‌‌ వర్కర్లకు మాత్రమే బూస్టర్ డోసు ఇవ్వాల్సి ఉంటుంది.

Read Also… Health Tips: కరోనా కాలంలో ప్రతీ ఉదయం ఇది తీసుకోండి.. రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు..!