Asia Cup Cricket Tournament Postponed till June 2021 : ఆసియాకప్ నిర్వహిద్దామనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు దిమ్మతిరిగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గట్టిగా షాక్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణ సాధ్యం కాదంటూ తేల్చి చెప్పింది. జూన్ 2021కి వాయిదా వేస్తున్నట్లు ఏసీసీ ప్రకటించింది. 2021లో నిర్వహించనున్న ఆసియాకప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇదిలావుంటే.. ఏసీసీ సమావేశానికి ఒకరోజు ముందే బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు గంగూలీ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా ఆసియా కప్ రద్దు కానుందని చెప్పిన విషయం తెలిసిందే.. అయితే దాదా మాటలను పాకిస్తాన్ బోర్డ్ సభ్యులు కొట్టిపారేశారు… గంగూలీ మాటలు గాలి మాటలు అంటూ ఎద్దేవ చేశారు.. కానీ ఒక్క రోజు గడిచిందో లేదో.. దాదా చెప్పిందే నిజమైంది.
గంగూలీ చేసిన వాఖ్యలను నిజం చేస్తూ ఆసియా కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఆసియా కప్‌ను పాక్ నిర్వహించాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో పీసీబీ సెప్టెంబర్‌లో టోర్నీని నిర్వహించాలనుకుంది. కాగా ఏసీసీ తాజా ప్రకటనతో పీసీబీకి పెద్దదెబ్బే తగిలిందని చెప్పొచ్చు. తాజాగా టోర్నీని వాయిదా వేయాలని ఏసీసీ నిర్ణయం తీసుకోవడంతో ఐపీఎల్ నిర్వహణకు రూట్ మరింత క్లీయర్ అయ్యింది.