క‌రోనా అల‌ర్ట్ః ఏపీలో రెడ్‌జోన్‌లోకి 97 మండ‌లాలు…ఇవే

| Edited By: Pardhasaradhi Peri

Apr 19, 2020 | 3:43 PM

రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది.

క‌రోనా అల‌ర్ట్ః ఏపీలో రెడ్‌జోన్‌లోకి 97 మండ‌లాలు...ఇవే
Follow us on
రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్కటి నమోదుకాకుంటే గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరినట్లు అధికారులు ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కొవిడ్‌-19 హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో11 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జాతీయస్థాయిలో 6.2 రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 2.5 రోజులు, గుంటూరు జిల్లాల్లో 3.3 రోజులు, చిత్తూరు జిల్లాలో 3.7 రోజులు, అనంతపురం జిల్లాలో 3.9 రోజుల్లో కేసులు రెండింతలు పెరిగినట్లు శనివారం వరకు నమోదైన గణాంకాల ఆధారంగా వెల్లడించింది.
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 17 మండలాలను రెడ్ జోన్లుగా నిర్ధారించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ అనే ప్రసక్తే లేకుండా పోయింది. కేసులు నమోదైతే గ్రీన్‌జోన్‌ మండలం రెడ్‌జోన్‌లోకి వెళ్తుంది. ఈ నెల 20 నుంచి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను జిల్లాల్లో అమలుచేయాలని కలెక్టర్లను కోరింది.
ఇక‌, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న  కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షల నిర్వహణ వెంటనే పూర్తి చేయాలని సీఎం తెలిపారు. కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు.