AP COVID -19 cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతి రోజూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 30,851 శాంపిల్స్ ను పరీక్షించగా 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ఇవాళ కరోనా వైరస్ బారినపడిన వారిలో 480 మంది చికిత్స పొందుతూ కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, మంగళవారం ఒక్కరోజే మహమ్మారి బారినపడి ముగ్గురు ప్రాణాలనను కోల్పోయారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది .
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,00,805 కు చేరింది. మొత్తం కరోనా బారినపడినవారిలో 8,86,978 మంది చికిత్సకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,614 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 7,213 మంది మృత్యువాడపడ్డారని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇవాళ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 198, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,50,52,215 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదిలావుంటే , మహమ్మారి కరోనా వైరస్ రెండో విడత వేగాన్ని పెంచింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. వరుసగా రెండు రోజుల పాటు 60వేలకుపైగా కేసులు నమోదుకావడం గత ఏడాది అక్టోబర్ 15, 16 తేదీల తర్వాత ఇదే ప్రథమం. కొత్తగా నమోదైన కేసుల్లో 84.5% కేవలం 8 రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఇందులో 60% కేసులు మహారాష్ట్ర నుంచి రాగా, మిగిలిన 40% ఏడు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు నిలిచాయి. దేశంలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 14 రోజుల్లో లేనన్ని గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా , రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, బీహార్, జమ్మూ-కశ్మీర్, చండీగఢ్, ఒడిశా, పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలీ ఉన్నాయి.
Read Also… Covid Warning: కరోనా సెకెండ్ వేవ్ మరింత తీవ్రం.. రాష్ట్రాలకు కేంద్ర తాజా హెచ్చరికలు