
కరోనా, లాక్‌డౌన్ విద్యార్థులను బడికి దూరం చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. కాగా కొన్ని పాఠశాలలు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ తరగతులకు నోచుకోని గ్రామీణ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా “విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్’ని ప్రారంభించింది. ఇప్పట్లో గురుకుల పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ పేరిట రాష్ట్రంలోని 320 గ్రామాల్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్).
ఈ విలేజ్ లెర్నింగ్ విధానంతో గ్రామాల్లో ఉండి, ఇంటర్‌నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు నేరుగా కొంత మంది విద్యార్థులే టీచర్లుగా మారి పాఠాలు భోదిస్తున్నారు. ఇందుకోసం సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల్లో కొంతమందిని ప్రత్యేకించి ఎంపిక చేశారు. వారిని సూపర్ స్టూడెంట్స్, గ్రీన్ గురూస్‌ను టీచింగ్ అసిస్టెంట్స్‌గా చెబుతున్నారు. వీరికి ఉపాధ్యాయులు తరగతుల వీడియోలను పంపుతారు. వారు ఆ వీడియోలను అవగాహన చేసుకొన్న తర్వాత జూనియర్ విద్యార్థులకు బోధిస్తారు. ఇందుకోసం కనీసం 10 మంది విద్యార్థులున్న గ్రామాలను గుర్తించి అక్కడే తరగతులు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఓ గంటపాటు తరగతులు బోధిస్తారు.
అనేకగ్రామాల్లో వీటిని గ్రామ పంచాయతి కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలల ఆవరణం, చెట్ల కింద నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాల్లో గ్రామపెద్దలు వారి ఇంటి ఆవరణల్లోనే తరగతులకు అనుమతిస్తున్నారు. స్మోర్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన, దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావించిన టీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు.