
సాధారణంగా ఉద్యోగం చేయాలంటే ఎన్నో గంటలు కష్టపడాలి. చదువుకోవాలి, నైపుణ్యాలను పెంచుకోవాలి, ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. కానీ ఒక యువతి మాత్రం హాయిగా నిద్రపోతూనే లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకుంది. అంతేకాదు, ఉచితంగా విహారయాత్రకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ప్రముఖ సంస్థ వేక్‌ఫిట్ (Wakefit) నిర్వహించిన ఐదో సీజన్ స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో ముంబైకి చెందిన జినియా ఛటర్జీ విజేతగా నిలిచి రూ.9.6 లక్షల ప్రైజ్ మనీతో పాటు స్పాన్సర్డ్ వెకేషన్‌ను గెలుచుకుంది.
వేక్‌ఫిట్ సంస్థ 2019లో ప్రారంభించిన ఈ వినూత్న స్లీప్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఐదో సీజన్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 2 లక్షలకు పైగా దరఖాస్తులను పరిశీలించి కేవలం 10 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు నెలల పాటు ఈ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్నవారు ప్రతిరోజూ తగినంత నిద్రపోవడం, క్రమబద్ధమైన నిద్ర అలవాట్లను పాటించడం, వారానికి ఒకసారి నిర్వహించే ప్రత్యేక ఛాలెంజ్‌లలో పాల్గొనడం ద్వారా పాయింట్లు సంపాదించాల్సి ఉంటుంది. మొత్తం 60 రోజుల పాటు వారి నిద్ర సమయం, నిద్ర నాణ్యత, రోజువారీ స్కోర్లను పర్యవేక్షించారు.
ఈ ఇంటర్న్‌షిప్‌లో కేవలం నిద్రపోవడమే కాకుండా పాల్గొనేవారి సృజనాత్మకతను పరీక్షించే అనేక ఆసక్తికరమైన టాస్కులను కూడా నిర్వహించారు.
ఇలా ప్రతి వారం నిర్వహించే ఛాలెంజ్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ అనే గుర్తింపును ఇచ్చారు. 60 రోజుల పోటీ ముగిసే సమయానికి రత్నగిరికి చెందిన మణికందన్, జినియా ఛటర్జీ, మెహెక్ ఖోట్ టాప్-3లో నిలిచారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన కరీమ్ ఖాన్ వారానికొకసారి నిర్వహించిన క్రియేటివ్ ఛాలెంజ్‌లలో అత్యధిక విజయాలు సాధించి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి పోటీలోకి వచ్చారు. దీంతో మొత్తం నలుగురు పోటీదారులు ‘బిగ్ బెడ్’ పేరుతో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. రియాలిటీ టీవీ షో తరహాలో ఈ ఫైనల్ పోటీని నిర్వహించారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా పోటీదారులకు పలు ఆసక్తికరమైన టాస్కులు ఇచ్చారు.
ఈ టాస్కులన్నీ పూర్తయ్యాక పోటీదారులు తమకు కేటాయించిన బెడ్రూమ్లలో చివరి రాత్రి నిద్రపోయారు. ఆ రాత్రి వారి స్లీప్ స్కోర్లు విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి. చివరగా అన్ని స్కోర్లను పరిశీలించిన నిర్వాహకులు ముంబైకి చెందిన జినియా ఛటర్జీని ఐదో సీజన్ విజేతగా ప్రకటించారు. దీంతో ఆమెకు రూ.9.6 లక్షల ప్రైజ్ మనీతో పాటు స్పాన్సర్డ్ వెకేషన్ బహుమతిగా లభించింది. ఈ విజయంతో వేక్‌ఫిట్ ఐదో సీజన్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ముగిసింది.2019లో ప్రారంభమైన వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు ఇప్పటివరకు భారీ స్పందన లభించింది. మొదటి నాలుగు సీజన్లలో కలిపి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నాలుగు సీజన్లలో మొత్తం 65 మంది ఇంటర్న్‌లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున స్టైపెండ్ అందించారు. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై అవగాహన కల్పించడంతో పాటు, నిద్రను కూడా ఒక ఆసక్తికరమైన పోటీగా మార్చిన వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హాయిగా నిద్రపోతూనే లక్షల రూపాయల బహుమతి గెలుచుకున్న జినియా ఛటర్జీ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.