
అమరావతి, జూన్ 18: అసలు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల సమయంలో రిజర్వేషన్ల అమలు ఏ విధంగా ఉంటుంది అనే సందేహాలు నిరుద్యోగ అభ్యర్ధుల్లో మెదులుతున్నాయి. ముఖ్యంగా వర్టికల్ రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడా ఏమిటి? మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయి? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఏ విధంగా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి సామాజిక వర్గాలకు కేటాయించే రిజర్వేషన్లను వర్టికల్ రిజర్వేషన్లు అంటారు. ఇవి వర్గాల వారీగా నిర్దిష్ట శాతంతో అమలవుతాయి. ప్రతి వర్గానికి చట్టబద్ధంగా కేటాయించిన కోటా ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఉదాహరణకు జనరల్, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ప్రత్యేక శాతం కేటాయిస్తారు. అయితే జనరల్ కేటగిరీ పోస్టులకు అన్ని వర్గాల అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంటుంది.
మహిళలు, దివ్యాంగులు (PwD), మాజీ సైనికులు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు కల్పించే రిజర్వేషన్లను హారిజాంటల్ రిజర్వేషన్లు అంటారు. ఇవి ఏ ఒక్క వర్గానికి మాత్రమే కాకుండా అన్ని వర్టికల్ కేటగిరీలలో అడ్డంగా అమలవుతాయి. అందుకే వీటిని హారిజాంటల్ రిజర్వేషన్లు అని పిలుస్తారు. దీన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే అసలు సంగతి అర్ధంకాక తప్పులో కాలేస్తారు. ఇక మహిళా రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారంటే.. ఒక నియామక ప్రక్రియలో 100 పోస్టులు ఉంటే.. అందులో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్ అమలులో ఉంటుంది. అంటే ఇందులో అన్ని కేటగిరీల నుంచి 33 మంది మహిళలు ఎంపిక చేస్తారు. మెరిట్, వర్టికల్ రిజర్వేషన్ల ఆధారంగా కేవలం 28 మంది మహిళలే ఎంపికైతే, మిగతా 5 పోస్టులను కూడా మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. ఇందుకోసం ఆయా కేటగిరీలలో చివరిగా ఎంపికైన పురుష అభ్యర్థుల స్థానంలో అర్హత కలిగిన మహిళలను ఎంపిక చేస్తారు.
ఒక కేటగిరీలో 12 పోస్టులు ఉంటే మహిళా రిజర్వేషన్ ప్రకారం కనీసం నలుగురు మహిళలు ఎంపిక కావాల్సి ఉంటుంది. కానీ మెరిట్ జాబితాలో ఒక మహిళ మాత్రమే ఉంటే, మిగిలిన ముగ్గురు మహిళలను అదే కేటగిరీ నుంచి ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో మహిళలకు అదనపు పోస్టులు ఇవ్వరు. ఇప్పటికే ఉన్న కోటాలోనే మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఇదే విధానం అన్ని రిజర్వేషన్ కేటగిరీలకు వర్తిస్తుంది. దివ్యాంగుల రిజర్వేషన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ ఉంటే.. 100 పోస్టుల్లో కనీసం నలుగురు దివ్యాంగులు ఎంపిక చేయాలి. అయితే ఎంపిక జాబితాలో ఇద్దరు మాత్రమే ఉంటే, మిగిలిన ఇద్దరి స్థానాలను అర్హులైన దివ్యాంగ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిన వివరాల ప్రకారం ముందుగా మెరిట్, వర్టికల్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ల శాతం పూర్తి చేయాలి. లోటు ఉంటే మాత్రమే అవసరమైన సర్దుబాట్లు చేసి మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు తదితర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అదనపు కోటా కాదు. ఇది ప్రతి సామాజిక వర్గంలో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు వంటి వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే విధానం మాత్రమే. ఉద్యోగ నియామకాలలో హారిజాంటల్ రిజర్వేషన్ల విధానాన్ని సరిగా అర్థం చేసుకోవడం ద్వారా అభ్యర్థుల్లో ఉన్న అపోహలు తొలగిపోతాయి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగబద్ధమైన ప్రాతినిధ్యం అందించడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది.