హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షను టీఎస్పీయస్సీ మళ్లీ వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్- 2 (TSPSC Group 2) పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా పరీక్షను వచ్చే ఏడాది (2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) మంగళవారం (అక్టోబర్ 10) ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడంతోపాటు కొత్త తేదీలను కూడా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష కోసం నిరుద్యోగులు పోటీపడి ప్రిపేరవుతున్నారు. ఈ క్రమంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించడం చర్చణీయాంశంగా మారింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఓసారి పరీక్ష తేదీని మార్చిన కమిషన్ ఇప్పుడు రెండోసారి పరీక్ష వాయిదా వేస్తూ ప్రకటన వెలువరించడం గమనార్హం. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అప్పుడు రాష్ట్రంలో వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పరీక్షలకు సన్నద్ధమవడానికి సరిపడా సమయం లేదని.. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఈ క్రమంలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన అధికారులు తాజా మరోమారు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 783 పోస్టులకు గ్రూప్ 2 నియమాక నోటిఫికేషన్ విడుదలవగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.