హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో (మార్చి 14)తో ముగుస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్ విండో క్లోజ్ అవనుంది. దీంతో ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ రోజు గ్రూప్ 1 అప్లికేషన్‌లకి చివరి రోజని, అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని సూచించారు. ఇంతకు ముందు అప్లై చేసిన వారు ఎలాంటి రుసుము లేకుండా మరోసారి అప్లికేషన్ నింపాలని ఆయన కోరారు.
టీఎస్పీయస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 19వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించిన కమిషన్ మార్చి 14 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో డువు విధించింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్తగా విద్యార్హత పొందిన అభ్యర్ధులు కూడా గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. కాగా మార్చి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.70 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 2022 ఏప్రిల్‌లో గత ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు 3.80 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే చివరిరోజున భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈసారి కూడా అలాగే జరగవచ్చని టీఎస్‌పీఎస్సీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష రెండు సార్లు రద్దు కావడంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒకసారి పేపర్ లీకేజీ, మరోసారి నిబంధనలు సరిగా పాటించలేదని ప్రిలిమ్స్ పరీక్షను కోర్టు రద్దు చేసింది.
విద్యార్ధులారా.. గ్రూప్ -1 అప్లికేషన్ కు మరికొద్ది గంటల సమయమే ఉంది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు వెంటనే అప్లై చేయండి..
“కాంగ్రెస్ ప్రభుత్వం – నిరుద్యోగుల ఆకాంక్షలు తీర్చే ప్రభుత్వం” @TelanganaCMO @revanth_anumula @TSPSCofficial pic.twitter.com/bpgJhvwG1s
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 14, 2024
ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గతంలో ఇచ్చిన 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మొత్తం గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కి చేరింది. ఇక ఇప్పటికే గ్రూప్ 1 పోస్టులకు ఆయా కేటగిరీల్లో సర్కార్ వయోపరిమితి పెంచింది కూడా. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు ముగుస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.