హైదరాబాద్, జనవరి 10: 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 12 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు పొందిన 6 నుంచి 10వ తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఆరో తరగతిలో కొత్తగా సీట్లను భర్తీ చేస్తారు. ఏడో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయా తరగతుల్లో ఉన్న ఖాళీలను బట్టి కొత్త విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలతోపాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మార్చి 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు బీసీ గురుకులాల జిల్లా ఆర్సీవో గౌతంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జనవరి 8వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గురుకులాల్లో ఖాళీలను బట్టి ప్రవేశ పరీక్షలో రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారని తెలిపారు. కాగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 30 బీసీ సంక్షేమ గురుకల పాఠశాలలు ఉన్న సంగతి తెలిసిందే.
హుజూరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రాత పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హుజూరాబాద్ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ మీనాక్షి ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల నియామకాలకు జనవరి 8న నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. మార్చి 3న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.