హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న ఎంసెట్ ప్రవేశపరీక్ష పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017 ఎంసెట్‌లో మార్పులు చేశారు. అప్పటి వరకూ ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ఒకే పరీక్ష నిర్వహిస్తూ వచ్చింది. అయితే 2017లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయితే ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే ఎంసెట్ నిర్వహిస్తోన్నా.. అప్పటి నుంచి ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతోంది.
దాన్ని తొలగించాలని తాజాగా ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్ పేరును తొలగించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది కూడా. ఎంసెట్ (EAMCET)లో ఎం (M) అక్షరాన్ని తొలగించి, టీఎస్‌ఈఏపీ సెట్ లేదా టీఎస్‌ఈఏ సెట్‌గా పేరు మార్చాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో P అనే అక్షరానికి ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ రెండు పేర్లలో ఒకదాన్ని ఫైనలైజ్ చేసి త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంసెట్‌ను ఈఎసీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. Eamcet అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మెడికల్స్ అడ్మిషన్స్ రద్దుచేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ పేరును ఏపీ ఈఎపీసెట్‌గా మార్చింది. AP EAPCET అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ పేరుతోనే గత కొన్నేళ్లుగా ఏపీ ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపడుతోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.