
హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఎక్కడా గ్యాప్ లేకుండా జూన్ 5 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరుసగా జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ క్రమంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు తమ జిల్లా పేరు, పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి 2026 సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. జవాబు పత్రాల మూల్యాంకనం, స్కానింగ్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇక ఫలితాలను జూన్ 10వ తేదీలోపు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫలితాల విడుదలకు సంబంధించిన తుది చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి మే 21 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,98,358 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్, డిగ్రీ ప్రవేశాలు ప్రక్రియలు ప్రారంభమవుతాయి.