
హైదరాబాద్, ఏప్రిల్ 30: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంధ్ర భారతి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే అనుకున్న సమయానికి ఫలితాలు విడుదల చేయడంలో కొత్త ఆలస్యం నెలకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. తాజా సమాచారం మేరకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి విజయవాడకు బయల్దేరుతారు.
అనంతరం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు కృష్ణా జిల్లా కంకిపాడులోని కళ్యాణ మండపంలో దేవినేని ఉమ కుమారుని వివాహానికి సీఎం రేవంత్ హాజరవుతారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి రవీంద్ర భారతికి చేరుకుని మధ్యాహ్నం మధ్యాహ్నం 1.15 గంటలకు కొంచె అటుఇటుగా పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.. ఇదీ ఈ రోజుకి సీఎం రేవంత్ షెడ్యూల్.
అయితే మంగళవారం నాటి విద్యాశాఖ ప్రకటన ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు విడుదల కావల్సిన ఫలితాలు.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ కారణంగా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 1.30 గంటలకు ఫలితాలు మాత్రం పక్కాగా వెల్లడవుతాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడనుంది.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. ఈ రోజు ఫలితాల వెల్లడికి విద్యాశాఖ అధికారులు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాల వెల్లడి అనంతరం టీవీ 9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలో కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.