TS EAPCET 2026 Toppers: ఈఏపీసెట్‌లో సత్తా చాటిన హైదరాబాద్‌ కుర్రాడు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే

Telangana EAPCET 2026 Top Rankers: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్) 2026 ఫలితాలు ఆదివారం (మే 17) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేశారు..

TS EAPCET 2026 Toppers: ఈఏపీసెట్‌లో సత్తా చాటిన హైదరాబాద్‌ కుర్రాడు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే
Telangana EAPCET toppers list

Updated on: May 17, 2026 | 11:59 AM

హైదరాబాద్‌, మే 17: జేఎన్టీయూ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు మొత్తం 3లక్షలకు పైగా విద్యార్ధులు రాశారు. పరీక్షలు ముగిసిన 6 రోజులకే ఈఏపీసెట్‌ ఫలితాలు వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 3,01,734 మంది ఈఏపీసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వీరికి 16 టెస్ట్ జోన్లలో 125 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో మే 11 వరకు పరీక్షలు జరిగాయి. 93.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 84,954 మంది పరీక్షకు హాజరయ్యారు. 6,023 మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 2,10,766 మందికిగానూ 1,97,242 మంది పరీక్షకు హాజరయ్యారు. 13,524 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు.

తాజాగా విడుదలైన ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 93.58 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 93.38 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు. పరీక్షలకు హాజరైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్కులు, నార్మలైజ్డ్ స్కోర్లు, ర్యాంక్‌లు కూడా అందుబాటులో ఉంచారు. పరీక్షలు పూర్తయిన ఆరో రోజే ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఈ ఏడాది పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్‌ స్క్రీన్‌పై మార్కులు ప్రత్యక్షమయ్యేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 టాప్ 10 ర్యాంకర్లు వీరే

  • ఫస్ట్‌ ర్యాంక్‌.. ఎం.రుషి (ఉప్పల్)
  • సెకండ్‌ ర్యాంక్‌.. అన్షుల్ (మూసాపేట్)
  • థార్డ్‌ ర్యాంక్‌.. ఎం.వంశీధర్ రెడ్డి (పులివెందుల, కడప)
  • నాలుగో ర్యాంక్‌.. జే.రోషన్ మణిదీప్ ( గుంటూరు)
  • ఐదో ర్యాంక్‌.. ఎ.సాయి నిఖిత్ (మహబూబ్ నగర్)
  • ఆరో ర్యాంక్‌.. ఎం.ఆస్నా ( మేడ్చల్)
  • ఏడో ర్యాంక్‌.. వి.శరద్ మహేశ్వరీ (బంజారాహిల్స్)
  • ఎనిమిదో ర్యాంక్‌.. టి.శ్రేయాష్ రెడ్డి (కొండాపూర్)
  • తొమ్మిదో ర్యాంక్‌.. బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి (ఎల్బీనగర్)
  • పదో ర్యాంక్‌.. రాపోలు జయంత్ శేఖర్ రెడ్డి (సుచిత్ర)
Follow Us