
అమరావతి, మే 6: ఇటీవల విడుదలైన రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్ధులు ఒక సబ్జెక్టులో ఫెయిలైనట్లు అధికారులు గుర్తించారు. అది మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులనుకుంటే తప్పులో కాలేసినట్లే. వీరంతా ఫెయిల్ అయింది మాతృ భాష అయిన తెలుగు సబ్జెక్టులో మరి. ఫెయిల్ అయిన విద్యార్థుల్లో అత్యధికంగా ఈ ఒక్క సబ్జెక్టులో తప్పినవారే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 91,150 మంది విద్యార్ధులు ఫెయిల్ కాగా, వారిలో కేవలం ఒక్క సబ్జెక్టులోనే ఫెయిల్ అయినవారు 44,662 మంది అంటే 49 శాతం మంది ఉన్నారు. ఇక 23.3 శాతం మంది 2 సబ్జెక్టుల్లో, 14.2 శాతం మంది మూడు సబ్జెక్టుల్లో, 3.9 శాతం మంది 5 సబ్జెక్టుల్లో తప్పారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులే అధికంగా ఉన్నారు. మొత్తం 76,957 మంది ప్రభుత్వ బడుల్లో చదివిన వారు ఉన్నారు.
మొత్తం విద్యార్ధుల్లో అబ్బాయిలు 54,376 మంది, 36,774 మంది అమ్మాయిలు ఉన్నారు. ఫెయిలైన విద్యార్థుల్లో ఏకంగా 37,679 మంది అంటే 41.3 శాతం మంది విద్యార్థులు తెలుగులో గట్టెక్కలేక చతికిల పడ్డారు. హిందీలో 1.6 శాతం మంది, ఆంగ్లంలో 9.6 శాతం మంది ఫెయిలయ్యారు. భాషా సబ్జెక్టుల్లో ఒక్క తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు. అత్యధికంగా సైన్స్ సబ్జెక్టులో 59.5 శాతం మంది, ఆ తర్వాత మ్యాథమెటిక్స్‌లో 43.6 శాతం, సోషల్ స్టడీస్‌లో 41.8 శాతం మంది అనుత్తీర్ణులయ్యారు.
ఇక పదో తరగతిలో గట్టె్క్కలేకపోయిన విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. ఒకే పాఠశాలలో 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఫెయిలైతే అదే బడిలో చోట అదే పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. తక్కువ మంది విద్యార్థులుంటే 2, 3 పాఠశాలలకు కలిపి ఒకచోట తరగతులు బోధిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల స్కూళ్లలో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.