
హైదరాబాద్, డిసెంబర్ 25: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) 198 పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గురువారం (డిసెంబర్ 25) ప్రకటన జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో రవాణా కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి 84 ట్రాఫిక్ సూపర్ వైజర్స్ ట్రైనీలు (టీఎస్‌టీ), వాహనాల ఫిట్‌నెస్, మెకానికల్ పనుల పర్యవేక్షణ కోసం 114 మెకానికల్ సూపర్ వైజర్స్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 30, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా జనవరి 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా అందుతాయి.
అర్హత కలిగిన అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి డిసెంబరు 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు, పరీక్షా విధానం, సిలబస్, ఫిజికల్ టెస్టులు వంటి ఇతర వివరాలను వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు. అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో అర్హత ఉంటే సరిపోతుంది. మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు మాత్రం సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీలో అర్హత ఉంటే సరిపోతుంది.
ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.