TG JL Final Results: ‘జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి’ నిరుద్యోగుల డిమాండ్‌

|

Oct 07, 2024 | 6:45 AM

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ లెక్చరర్ల పరీక్ష తుది ఫలితాలు వెంటనే విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని జేఎల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాభవన్‌కు చేరుకున్న అభ్యర్ధులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు..

TG JL Final Results: జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగుల డిమాండ్‌
TG JL Final Results
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ లెక్చరర్ల పరీక్ష తుది ఫలితాలు వెంటనే విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని జేఎల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాభవన్‌కు చేరుకున్న అభ్యర్ధులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీతో మాట్లాడి వెంటనే జేఎల్‌ పోస్టుల తుది ఫలితాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీతో పాటు జేఎల్‌ నియామక పత్రాలు ఇవ్వాలని కోరుతూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరాంను కూడా ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా మొత్తం 1,392 జేఎల్‌ పోస్టులకు ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. నెలలు గడుస్తున్న తుది ఫలితాలు వెలువరించక పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.

నవంబర్‌ 24 నుంచి యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఐఎఫ్‌ఎస్‌)-2024 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు మెయిన్స్‌ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షలు నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 1 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మొత్తం 150 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

సబ్జెక్టుల వారీగా ఐఎఫ్‌ఎస్‌ ప్రధాన పరీక్ష తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి.. 24,466 మంది హాజరు

తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. మొత్తం 25,924 మంది అభ్యర్ధులకు అవకాశం కల్పించగా 24,466 మంది హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. అంటే దాదాపు 1,458 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదు. వికారాబాద్‌ జిల్లాలో 923 మందికి 400, కొత్తగూడెంలో 1018కి 936, హైదరాబాద్‌లో 1537కి 1355 మంది హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలో 715 మందికి ఒక్కరు చొప్పున గైర్హాజరయ్యారు. ఇక నేడో రేపో 1:1 చొప్పున తుది ఫలితాలు వెల్లడించి, అక్టోబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.