
హైదరాబాద్, జులై 28: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి విద్యార్థులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరంలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సుమారు రూ.2,200 కోట్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని ముందుగానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసి చెల్లింపులు సకాలంలో జరిగేలా చూస్తామని సీఎం వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.8,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయించిన తర్వాతే బీజేపీ నేతలు రామచంద్రరావు, ఆర్. కృష్ణయ్య తెలంగాణపై మాట్లాడాలని సూచించారు.
హైడ్రా (HYDRAA)పై ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ సంస్కరణల్లో హైడ్రా ఒకటని పేర్కొన్నారు. పార్కులు, చెరువులు వంటి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ఎలాంటి రాజీ ఉండదని, కబ్జాదారులకు సహకరించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైడ్రాను రద్దు చేయాలని కోరేది కేవలం భూ ఆక్రమణదారులు, వారిని సమర్థించే వారేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా హైడ్రాకు మంచి గుర్తింపు వచ్చిందని, దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏ అధికారిని ఏ బాధ్యతలో ఉపయోగించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారమని, దానిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బతుకమ్మ కుంటలో 10 ఎకరాల భూమిని ఆక్రమించిన టీఆర్‌ఎస్ నాయకుడు, కేసీఆర్ పర్యటన సందర్భంగా పూల వర్షం కురిపించాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఎకరాలు కబ్జా పెట్టిన వ్యక్తి పూల వర్షమే కాదు, కనకవర్షం కూడా కురిపించవచ్చు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన చట్టాన్ని పార్లమెంట్‌లో తీసుకొస్తామని సీఎం తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.