
హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెటస్ (టెట్ 2026) హాల్‌టికెట్లు శనివారం (డిసెంబర్ 27) విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ వివరాలతో లాగిన్ అయిన తర్వాత హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ టెట్ 2026 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రతి సెషన్ పరీక్షకు అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. జిల్లా వారీగా ఏ రోజు ఏ జిల్లా అభ్యర్థులకు ఏయే పరీక్షలు ఉంటాయో తెలుపుతూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను పొందుపరిచింది. అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, కేంద్రాన్ని తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
కాగా టెట్ పరీక్షలు మొత్తం 2 పేపర్లకు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈసారి పేపర్ 1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈసారి సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్యం భారీగా పెరిగింది. వచ్చే రెండేళ్లలో సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లు తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో మొత్తం 70 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇక టెట్ పరీక్షల అనంతరం ఫిబ్రవరి 10 నుంచి 16 తేదీల మధ్య ఫలితాలను వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.