
హైదరాబాద్, అక్టోబర్ 16: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) 2025-26కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ కీలక ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ స్కాలర్‌షిప్‌కు 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తాజా ప్రకటన మేరకు అక్టోబర్ 18, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలాగే పరీక్ష ఫీజు కూడా చెల్లించవచ్చని ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు సూచించారు.
ఇక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 22 లోపు విద్యార్ధుల ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల డౌన్‌లోడ్ కాపీలు, ఫీజు రసీదులు, నామినల్ రోల్స్ రెండు కాపీలు చొప్పున సంబంధిత జిల్లా విద్యా అధికారి (DEO)కి సమర్పించాల్సి ఉంటుంది. డీఈఓలు ధ్రువీకరించిన పత్రాలను అక్టోబర్ 24 లోపు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది. కాగా ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం యేటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్ధిక భరోసా అందిస్తారు. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకారవేతనాన్ని అందిస్తోంది.
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు 8వ తరగతి తరువాత డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడం లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. అర్హులైన విద్యార్థులు ఎవరైనా సెప్టెంబర్ 18, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు గడువు పొడిగించడం కుదరడదని అధికారులు తెలిపారు.
తెలంగాణ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.