తెలంగాణ ఇంటర్మీడియట్ 2022-23 వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఫీజు చెల్లింపు గడువును పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిత్తల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు (డిసెంబర్ 6 వరకు), విద్యార్ధుల వినతిమేరకు మరోమారు పొడిగించింది. దీంతో రూ.500లకు బదులు రూ.100ల ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు ఇంటర్ ఫీజు చెల్లించవచ్చని తెల్పింది. ఫస్టియర్, సెకండియర్ సైన్స్, వొకేషనల్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ. 210తో కలిపి రూ.710 ఫీజుగా చెల్లించాలని పేర్కొంది. జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500లు చెల్లించాలి. ఈ ఏడాది జరగబోయే ఇంటర్ పరీక్షలను పాత పద్ధతిలో వంద శాతం సిలబస్ అమలవుతుందని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. హాజరు మినహాయింపు కింద ప్రైవేటు విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయెచ్చని బోర్డు సూచించింది.
కాగా గతంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 14 నుంచి 30లోపు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు, రూ.500 రుసుముతో డిసెంబర్ 8 నుంచి 12 వరకు, రూ. 1000ల ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్థుల అభ్యర్ధన మేరకు కేవలం రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు ఫీజులు చెల్లించేందుకు తాజాగా బోర్డు అనుమతి తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.