
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితోపాటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరో 7 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్ట్ 22 దీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అభ్యర్ధులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ పోస్టులను జోన్‌ల వారీగా భర్తీ చేస్తారు. మల్టీజోన్ 1లో 858, మల్టీజోన్ 2లో 765 పోస్టులను నియమించనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకోవడానికి అనర్హులని నోటిఫికేషన్‌లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారికి 20 పాయింట్లు అదనంగా కలపనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో పొందుపరిచిన అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.