
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీజీఎఫ్‌ఎస్‌ఎల్)లో ఉద్యోగ నియామకాలకు ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 60 సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు నవంబరు 27 నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబరు 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఆయన సూచించారు.
భారత నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ కూటమి సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో 2025-26 విద్యా సంవత్సరం నుంచి నీట్ నర్సింగ్ ప్రవేశపెట్టేవరకు ఏపీ నర్సింగ్ సెట్ 2025 నిర్వహించాలని, ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా మాత్రమే ప్రవేశాలు జరుగుతాయని పేర్కొంది.
ప్రవేశ పరీక్షలో జనరల్ విద్యార్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 40 శాతం, జనరల్- పీడబ్ల్యూడీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీలకు చెందిన పీడబ్ల్యూడీలకు 40 శాతం చొప్పున మార్కులు వస్తేనే అర్హతగా పొందినట్లు భావిస్తారని స్పష్టం చేసింది. కన్వీనర్ కోటాలో 60 శాతం, మేనేజ్‌మెంట్ కోటా 40 శాతం వెబ్ కౌన్సిలింగ్‌లో సీట్లు కేటాయిస్తామని తెలిపింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించి, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.