చదువుకోవడం వల్ల వ్యక్తుల ఆయుర్ధాయం పెరుగుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. స్కూల్ లేదా కాలేజీలో చదివేకొద్దీ ప్రతీ యేట వ్యక్తుల ఆయుష్సు పెరుగుతూనే ఉంటుందని వెల్లదించింది. అయితే స్కూల్‌కు వెళ్లని వారిలో ధూమపానం, అతిగా మద్యం సేవించడంతో సమానమైన ప్రాణాంతక ముప్పు సంభవిస్తుందట. యూకే, యూఎస్ వంటి పారిశ్రామిక దేశాలతోపాటు చైనా, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి సేకరించి డేటా ఆధారంగా విద్య ద్వారా ప్రతీయేట వయోజన మరణాల రేటు 2 శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు.
ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన పీర్-రివ్యూడ్ విశ్లేషణ ప్రకారం.. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ విద్యను పూర్తి చేయడం అనేది జీవితకాలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో సమానని పేర్కొంది. విద్య లేని వారితో పోలిస్తే మరణ ప్రమాదాన్ని 34 శాతం తగ్గిస్తుందట. అసలు తమ జీవితంలో స్కూల్‌కు వెళ్లని వారు ప్రతి రోజూ 5 గ్లాసులకు పైగా మద్యం తీసుకోవడంతో సమానం లేదా దశాబ్ధకాలంపాటు ప్రతి రోజూ 5 సిగరెట్లు కాల్చడంతో సమానమని పేర్కొంది. ఇది వారి ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా చేసేందుకు ఇంగ్లాండ్‌లో చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకునేలా చేసింది. స్కూల్ హాజరు, ఆరోగ్యం మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. తాజా అధ్యయనం భవిష్యత్తులో ఉన్నత విద్య అభ్యసించే యువకుల సంఖ్యను మరింత పెంచుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆయుర్ధాయంపై విద్య ప్రయోజనాల గురించి చాలా కాలం క్రితమే గుర్తించినప్పటికీ నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NTNU), సీటెల్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తల సమీక్షలు మొదటి సారిగా విద్యాభ్యాస కాలం, ఆయుర్ధాయంతో దాని కనెక్షన్‌ను లెక్కించింది. తద్వారా మరణాలను తగ్గించవచ్చని పేర్కొంది. విద్య – ఆరోగ్యం మధ్య సంబంధాన్ని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లోని మెడికల్ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ నీల్ డేవిస్ ‘ఆకట్టుకునే పని’గా అభివర్ణించారు.
యూకేలో ప్రస్తుతం గ్రాడ్యుయెట్లు, గ్రాడ్యుయెట్లుకాని వారి సంఖ్య సమానంగా ఉంది. స్కూల్‌కు వెళ్లని పిల్లలు భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పేద పిల్లల్లో ఇది మరింత అధ్వాన్నంగా ఉంటుంది. విద్యాభ్యాసం చేసిన సమయం, మరణాల మధ్య ఉన్న సంబంధాన్ని విపులంగా అధ్యయనం చేశారు. యూకేలో ఈ అసమానతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఆయుర్ధాయం రేటు పురుషులకు 9.4 ఉండగా, మహిళలకు 7.7గా ఉంది. ఇది పరిస్థితి తీవ్రతను వ్యక్తం చేస్తుందని అన్నారు. విద్య మెరుగైన సామాజిక సంబంధాలను నిర్మించడంతోపాటు ఆయుష్షు పెరుగుదలకు, మంచి జీవన విధానం, మెరుగైన ఆహారం వంటివి పొందడానికి సహాయపడుతుంది. ప్రపంచ మరణాల రేటులో అసమానతలను తగ్గించడానికి విద్యలో పెట్టుబడులు పెరగడం మంచి పరిణామమని పరిశోధకులు అంటున్నారు. ధనిక, పేద దేశాల్లో లింగం, సామాజిక తరగతి, జనాభాతో సంబంధం లేకుండా దీర్ఘాయువులో మెరుగుదల ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన పీర్-రివ్యూడ్ విశ్లేషణ మంగళవారం (జనవరి 23) ‘వయోజన మరణాలపై విద్య ప్రభావాలు: గ్లోబల్ సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా-విశ్లేషణ’ అనే శీర్షికతో పాఠశాలకు వెళ్లకపోవడం ధూమపానం లేదా అతిగా మద్యపానం మాదిరి ప్రాణాంతకం అని కనుగొంది. ఈ అధ్యయనం అంతర్జాతీయ విద్యా దినోత్సవానికి ముందు ప్రచురించబడింది. ఈ అధ్యయనం కోసం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దాదాపు 59 దేశాల నుంచి 600 కంటే ఎక్కువ కథనాలను సమీక్షించింది. 10,000 డేటా పాయింట్లను రూపొందించింది. దీని విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల, కళాశాల డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసినట్లయితే.. అసలు చదువుకోని వారితో పోల్చినప్పుడు మరణ ప్రమాదాన్ని 34 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.