ఇంటర్ పాసై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2022-23 సంవత్సారినికిగానూ.. ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2022’ (సీహెచ్‌ఎస్‌ఎల్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న 4500 లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో, గ్రేడ్-ఎ) పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే 12వ తరగతి లేదా ఇంటర్‌మీడియట్ లేదా తత్సమాన కోర్సులో అర్హత ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ కోర్సు చదివినవారితోపాటు ఓపెన్ స్కూల్‌లో చదివిన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1995వ తేదీ నుంచి జనవరి 1, 2004వ తేదీల మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయసులో సడలింపులు ఉంటాయి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 4, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాతపరీక్ష (టైర్-1, టైర్-2), కంప్యూటర్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రతిభకనబరచిన వారికి ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ పోస్టులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.