
హైదరాబాద్, నవంబర్ 5: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) .. దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదల చేసింది. క్లర్క్ పోస్టులకు రాత పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 6,589 క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో 5,180 రెగ్యులర్ పోస్టులు, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. అనంతరం స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 1 ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఫలితాలతో పాటు కటాఫ్ మార్కులను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ ఏడాది ఆగస్టు 12న పేపర్1 పరీక్ష నిర్వహించించింది. ఈ పరీక్షకు మొత్తం 6,332 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే పేపర్ 2కి అనుమతిస్తారు. పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్షకు 3642 మంది షార్ట్‌లిస్ట్ అయినట్లు కమిషన్ వెల్లడించింది. పేపర్ 2 షెడ్యూల్‌ను త్వరలో కమీషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది. కాగా మొత్తం 552 గ్రూప్ ‘బి’ నాన్ గేజిటెడ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.